శానిటైజర్ కరోనా కాలంలో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఎవరిని టచ్ చేసినా చేతుల్లో శానిటైజర్ పడాల్సిందే. అసలు లాక్ డౌన్ సమయంలో శానిటైజర్ దొరకడమే గగనమైపోయింది. ఆర్డర్లు ఇచ్చినా దొరకని పరిస్థితి కానీ ఇప్పుడు శానిటైజర్ వాడకాన్ని తగ్గించారు జనం.
కరోనా రాదనే నమ్మకమో లేదంటే వైరస్ లేదనే ధైర్యమో కానీ శానిటైజర్ కొనుగోలు అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. లాక్ డౌన్ కాలంలో శానిటైజర్ లభిస్తే దేవుడు వరమిచ్చినట్లు జనాలు ఫీలయ్యారు. శానిటైజర్లు ఉన్నాయని తెలిస్తే చాలు ఆ షాపు ముందర జనాలు క్యూ కట్టేవారు. ఆ తర్వాతి రోజుల్లో శానిటైజర్లు విరివిరిగా వచ్చేశాయి. కాని ఇప్పుడు పరిస్థితిల్లో మెడికల్ షాపులో శానిటైజర్లు నిల్వలు పేరుకుపోతున్నాయి.
ఎందుకంటే జనాలు శానిటైజర్ల వాడకాన్ని తగ్గించారు. కరోనా కాలాన్ని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు శానిటైజర్ తయారీని మొదలుపెట్టాయి. అవన్నీ ఇప్పుడు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. నిజానికి కోరోనావైరస్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి.
జనంలో భయం తగ్గడంతో కరోనా జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ఒకవేళ వైరస్ సోకినా ఏదో 14 రోజులు ఆసుపత్రికి వెళ్లి అక్కడ వుండి మాత్రలు వేసుకుని రావడమో, లేదంటే ప్రభుత్వం ఇచ్చే కిట్ తీసుకుని హోం క్వారెంటైన్లో గడపడంతో సింపుల్‌గా తగ్గిపోతుందనే భావన. దీంతో జనాలకు కరోనా అంటే భయం లేకుండా పోయింది.