అమెరికాలోని శ్రీమంతుల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా తయారు చేసింది. ఈ జాబితాలో మొత్తం 400 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో ఏడుగురు ఇండో- అమెరికన్ల పేర్లు ఉన్నాయి. వీరిలో సైబర్ సెక్యూరిటీ సంస్థ 'జడ్‌స్కాలర్' సీఈవో జయ్ చౌదరి, సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ రొమేశ్ వాధ్వానీ తదితరులు ఉన్నారు.
వీరిలో జయ్ చౌదరి నిరక సంపద 6.9 బిలియన్ డాలర్లు కాగా, ఈయనకు 85వ స్థానం దక్కింది. ఇకపోతే, రొమేశ్ వాధ్వానీ (3.4 బిలియన్ డాలర్లు) 238వ స్థానంలో ఉన్నారు. అలాగే, ఆన్‌లైన్ హోం గూడ్స్ రిటైలర్ 'వేఫెయిర్' సహ వ్యవస్థాపకుడు, సీఈవో నీరజ్ షా (2.8 బిలియన్ డాలర్లు) 299వ స్థానంలో, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ 'ఖోస్లా వెంచర్స్' వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా (2.4 బిలియన్ డాలర్లు) 353వ స్థానంలో నిలిచారు.
వీరేకాకుండా, 'షేర్పాలో వెంచర్స్' సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ కవిత్రక్ రామ్ శ్రీరామ్ (2.3 బిలియన్ డాలర్లు)తోపాటు ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్'కు చెందిన రాకేశ్ గంగ్వాల్ (2.3 బిలియన్ డాలర్లు), బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ 'వర్క్‌డే' సీఈవో, సహ వ్యవస్థాపకుడు అనీల్ భుస్రీ (2.3 బిలియన్ డాలర్లు) 359వ స్థానాన్ని దక్కించుకున్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (179 బిలియన్ డాలర్లు) ఈ జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. బిల్ గేట్స్ (111 బిలియన్ డాలర్లు) ద్వితీయ స్థానంలో, జుకర్ బెర్గ్ (85 బిలియన్ డాలర్లు) తృతీయ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో 339వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.