దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ఈ ఒక్క పార్టీనే ఏకంగా 301 సీట్లను కైవసం చేసుకుంటే.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా 350 సీట్లను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరోమా చతికిలపడింది. ఈ పార్టీకి కేవలం 54 సీట్లు మాత్రమే రాగా, దాని మిత్రపక్షాలకు 38 సీట్లు వచ్చాయి. అంటే యూపీఏ కూటమి 92 సీట్లతో సరిపుచ్చుకోగా, ఇతరులు 100 స్థానాల్లో విజయం సాధించారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పార్టీ ఏకంగా మొత్తం 175 సీట్లకు గాను 150 సీట్లను కైసవం చేసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 24 సీట్లతో సరిపుచ్చుకుంది.
సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఒక్క సీటుతో ఖాతా తెరిచింది. ఇక్కడ విచిత్రమేమిటంటే. జనసేనాని చేసిన రెండు చోట్లా చిత్తుగా ఓడిపోగా, ఆ పార్టీకి చెందిన రాజోలు అభ్యర్థి విజయం సాధించారు.
అలాగే, మొత్తం 25 లోక్‌సభ సీట్లలో వైకాపాకు 22 రాగా, టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. ఇక తెలంగాణాలోని 17 లోక్‌సభ సీట్లలో తెరాసకు 9, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీకి నాలుగు, ఎంఐఎంకు ఒక్కసీటు వచ్చింది.