పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. ఈ బహిరంగ సభలో పలుమార్లు మైక్ మొరాయించింది. దీనిపై వైకాపా పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తుంది. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు.
"మైక్ ఫెయిల్, మీటింగ్ ఫెయిల్ అని మొరిగే మూర్ఖులారా విన్నారా.. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.. మీకు భ్రష్టాచార్ అనే బిరుదునిచ్చారు అంటూ ఎద్దేవా చేశారు. భ్రష్టాచార్ అంటే అవినీతి. అవినీతి అంటే కరప్షన్. అవినీతి అనే కోటకు మకుటం లేని మహారాజు మీ నాయకుడు. ఆ అవినీతి కిరీటాన్ని మాకు కావాలి. మాకు కావాలి, మేమేం తక్కువ అని పోటీ పడుతున్న మీరు కూడా మా సభలను విమర్శిస్తుంటే ఎలా నవ్వాలో తెలియడం లేదు. మీ సిద్ధం సభల గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్‌లు గాల్లో దీపాల్లో తేలిపోతున్నాయి. ముందు మీరు ఆ వీఎఫ్‌ఎక్స్ ఎడిటర్‌ను మార్చితే తప్ప లక్షల్లో జనాలు వచ్చారని ఏమార్చలేరు. మొదట ఆ పనిలో ఉండండయ్యా బరితెగించిన భ్రష్టాచార్స్ అంటూ నాగబాబు చురకలు అంటించారు.
టీడీపీలో చేరిన ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వైకాపాను వీడి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిన విషయం తెల్సిందే.
ఇందులోభాగంగా, తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోమారు అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది.