Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభ - పాల్గొంటున్న మోడీ - చంద్రబాబు - పవన్ కళ్యాణ్

prajagalam

ఠాగూర్

, ఆదివారం, 17 మార్చి 2024 (09:49 IST)
దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాగళం పేరుతో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ వేదికను పంచుకోనున్నారు. ఒక రాజకీయ వేదికకపై మోడీ, చంద్రబాబులు దాదాపు పదేళ్ల తర్వాత ఆశీనులుకానున్నారు. ఈ ఇద్దరు నేతలను ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కే దక్కుతుంది. 
 
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తర్వాత కూటమి భాగస్వాములు అందరూ ఒకే వేదికపైకి రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఇది తొలి ఎన్డీఏ సభ కావడం గమనార్హం. ఇటీవల బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 
 
విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మార్చి 11న సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ 17 లోక్‌సభ స్థానాల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలుస్తుంది. 
 
ఇక జనసేన 2 లోక్‌సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 128 మందితో ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలోనే మిగతా పేర్లు కూడా వెల్లడించనున్నారు. ఇక జనసేన ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 543.. కానీ ఎన్నికలు నిర్వహించేది 544.. ఎలా?