Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ జగన్ మీ దత్తపుత్రుడు కాదా?.. పదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి.. ఇపుడు మాపై నిందలా...

ys sharmila

ఠాగూర్

, సోమవారం, 18 మార్చి 2024 (08:53 IST)
వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా కౌంటరిచ్చారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీ దత్త పుత్రుడు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇపుడు మాపై నిందలు మోపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడితో తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ప్రశ్నించారు. పదేళ్ల రాష్ట్ర వినాశంలో అత్యంత కీలక భూమికను పోషించి, ఇపుడు కాంగ్రెస్, వైకాపాలు ఒకటేనంటూ కూతలా? అంటూ ప్రధాని మోడీని షర్మిల కడిగిపారేశారు. 
 
ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాగళం బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీకి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు.
 
దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్‌ను, ఇటు చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఐదేళ్లుగా జగన్‌తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?' అంటూ షర్మిల నిలదీశారు.
 
'పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్‌పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?' అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రసమలై వంటకానికి విశిష్ట గుర్తింపు... ప్రపంచంలోనే రెండో ర్యాంకు