Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నెల 25న తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. కడప బరిలో వైఎస్ షర్మిల!!

ys sharmila

PNR

, మంగళవారం, 19 మార్చి 2024 (07:15 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ రెండు దశల్లో ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25వ తేదీన ప్రటించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో కడప లోక్‌సభ స్థానం నుంచి ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిలను బరిలోకి దించాలని నిర్ణయించింది. అలాగే, ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటే పోలింగ్ జరుగనుంది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించనుంది. 
 
ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. 
 
మరోవైపు, ఏపీలోని అధికార వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయనంటూ ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ఖండించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసిందని ఎవరని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో సీఏఏ, వ్యవసాయ, ఆర్టీ బిల్లులను ఆమోదించుకునేందుకు జగన్ పార్టీ ఎంపీల మద్దతు తీసుకున్నదెవరని ఆయన ప్రశ్నించారు. ఏపీ హక్కుల కోసం పోరాటం చేసింది, ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
వైఎస్ జగన్ మీ దత్తపుత్రుడు కాదు.. పదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి.. ఇపుడు మాపై నిందలా... 
 
వైకాపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా కౌంటరిచ్చారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీ దత్త పుత్రుడు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇపుడు మాపై నిందలు మోపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడితో తెరవెనుక స్నేహం నడిపింది ఎవరంటూ షర్మిల ప్రశ్నించారు. పదేళ్ల రాష్ట్ర వినాశంలో అత్యంత కీలక భూమికను పోషించి, ఇపుడు కాంగ్రెస్, వైకాపాలు ఒకటేనంటూ కూతలా? అంటూ ప్రధాని మోడీని షర్మిల కడిగిపారేశారు. 
 
ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాగళం బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీకి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు.
 
దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అటు జగన్‌ను, ఇటు చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని షర్మిల విమర్శించారు. పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఐదేళ్లుగా జగన్‌తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయసహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో?' అంటూ షర్మిల నిలదీశారు.
 
'పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ... వీరి స్నేహం, విడదీయరాని బంధం! హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయి. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్‌పై పసలేని దాడులు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?' అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కాలర్‌షిప్ పరీక్ష - ద్రోణాచార్య IIని ప్రారంభించిన FIITJEE