చాలామంది చిన్నారులు మెుండిగా ఉంటారు. ఎప్పుడూ వారు చెప్పిందే చేయాలని చెప్తుంటారు. ఒకవేళ అలాకాదని చెప్తే మాత్రం కోపానికి గురై మొండిగా ప్రవర్తిస్తుంటారు. మీ ఇంట్లోనూ పిల్లలు ఇలా ఉన్నారా.. అయితే వారిని దారిలోకి తేవడానికి ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది..
పిల్లలతో ఏ పనినైనా బలవంతంగా మాన్పించాలన్నా, చేయించాలనుకున్నా వ్యతిరేకిస్తే వారు మరింత మొండిగా తయారవుతారు. ముఖ్యంగా ఎదురుదాడి చేస్తారు. అలాకాకుండా ఉండాలంటే.. ముందు పిల్లలతో మమేకమవ్వండి. పని విషయంలో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. మీరు కోరుకున్న మార్పు వచ్చేవరకూ వారికి తోడుగా ఉండాలి. అలానే చిన్నారులకు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తుండాలి. అప్పుడే వారు మొండితనం నుండి విముక్తులవుతారు.
పిల్లలు వయసులో చిన్నవారేనైనా వారికి కూడా సొంత ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రులు.. ప్రతి పనీ ఇలా చేయి అలా చేయి అని వారితో చెప్పడం వలన వారు అలాంటి అంశాలపై అయిష్టత పెంచుకుంటారు. ఆ పనులు చేయకుండా ఉండాలనే ఆలోచన వారిలో ఎక్కువైపోతుంది. ఒక్కోసారి వారికి నచ్చినట్లు చేస్తారు. ఇలాంటి అలవాట్లను వారినలో మాన్నించాలంటే.. ప్రతి పనికి కొన్ని ప్రత్యామ్నాయాలు చూపించాలి. అప్పుడే వారు దానిలో ఒకటి ఎంచుకుంటారు. మీ మాట వింటారు.
మొండిగా ఉండే చిన్నారులను మీ దారిలోకి తేవాలంటే.. ముందువారి వాదన వినడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. పిల్లలు ఏదైనా విషయంపై అదేపనిగా వాదిస్తుంటే.. మీరు వెంటనే ఖండించొద్దు. ఎందుకంటే.. దానిపై కచ్చితంగా వారికో బలమైన అభిప్రాయం ఉండి ఉండొచ్చు. కనుక ముందు అదేంటో తెలుసుకోవాలి. ఆ తరువాతే మీ అభిప్రాయం చెప్పడమో, వారితో ఏకీభవించడమో చేయొచ్చు.