పాపులర్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. జూమ్ కాల్స్ కోసం రియల్ టైమ్, మల్టీ-లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను త్వరలోనే జోడిస్తున్నట్లు ప్రకటించింది. వర్చువల్ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుందని తెలిపింది.
విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకునే ఈ ఫీచర్ వెసులు బాటు కల్పించనుంది. వీడియో కాల్స్ సమయంలో వేర్వేరు భాషలకు చెందిన వారు ఇబ్బంది లేకుండా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు గాను ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
ఎదుటి వ్యక్తి మాట్లాడుతుండగానే మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు గాను జర్మనీకి చెందిన కైట్స్ అనే సంస్థను జూమ్ కొనుగోలు చేసింది. కైట్స్‌కు సంస్థలకు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్ మీటింగ్స్‌ను మరింత సులభతరం చేయనున్నామని జూమ్ చెబుతోంది.
ఈ లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా మొత్తం 12 భాషల్లో లైవ్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. అయితే ఏయే భాషలకు మద్దతిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.