వైఎస్సార్ ఆసరా, చేయూత కార్యక్రమాలపై రివ్యూ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు 35వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామన్నారు.
పనిలో పనిగా టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న మహిళ సంఘాలన్నీ సి గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేసిందన్నారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేసిందని ఆరోపించారాయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపెడయ్యాయని, 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడితో భారం పోయేదన్నారు జగన్.