ప్రపంచం యాంత్రీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిల్లో మనిషి తయారు చేసిన రోబో వల్ల మనిషికే నష్టం కలుగుతుందని మీకు తెలుసా? ఇదేదో రోబో చిత్రంలో చూపిన విషయం కాదు. ఇది ఉద్యోగాలకు సంబంధించిన విషయం.
రోబోల వలన 2030 నాటికి 20లక్షల మిలియన్ల (2 కోట్లు) మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఓ సర్వే తాజాగా స్పష్టం చేసింది. ఉద్యోగాలలో రోబోలను వినియోగించడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, సామాజిక అసమానతలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని ఈ సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ప్రముఖంగా తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు రోబోలు చెక్ పెడతాయని వారు అభిప్రాయపడ్డారు.
ప్రపంచం మొత్తం మీద అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో పోలిస్తే తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని, అయితే రోబోల వలన ఈ ఉద్యోగాలన్నింటికీ ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు. రోబోల వినియోగం ఇప్పటికే అధిక స్థాయిలో ఉందని వారు కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.
మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్, వాయిస్ రికగ్నైజేషన్ వంటి ఉద్యోగాలలో ఈ రోబోల రాక కారణంగా మనుషులు ఈ ఉద్యోగాలకు దూరం అయ్యారని, అలాగే భవిష్యత్తులో కూడా రీటైల్, ఆరోగ్య సంరక్షణ, హాస్పిటాలిటీ సేవలు, రవాణా, వ్యవసాయం వంటి రంగాల్లో రోబోల వినియోగం అధికంగా ఉండబోతోందని సర్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.