లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ ఎంటీఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి నెల రోజులపాటు ఉచిత డేటా అందిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
ఆఫీసులో చేసే అన్ని పనులను ఇంటి పట్టున ఉండి చేసుకునే సౌలభ్యం ఈ ఉచిత డేటా ద్వారా లభిస్తుందన్నారు. ఈ విషయంలో యాక్సెస్ లిమిటేషన్స్ ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ఇందుకోసం అదనంగా ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు.
ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కలిగిన ఆయా సంస్థల ఉద్యోగులు ఎంటీఎన్ఎల్ వీపీఎన్ఓబీబీ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఓవర్ బ్రాడ్‌బ్యాండ్)తో ఎనేబుల్ కావొచ్చని ప్రకటించారు.
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఓవర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా తమ కార్యాలయ సర్వర్లను యాక్సెస్ చేసుకోవచ్చని చెప్పారు. ఇది చాలా సురక్షిత మాధ్యమమని వెల్లడించారు. కార్యాలయంలో ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే అన్ని ఆఫర్లు ఈ సర్వీస్ ద్వారా పొందవచ్చని తెలిపారు.