ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్). ఈ సంస్థతో పాటు ఎంటీఎన్ఎల్ సంస్థలను విలీనం చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో ఈ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. 50 యేళ్లు పైబడిన ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అర్హులుగా ప్రకటించింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఆఫర్ ప్రారంభమైన రెండు రోజుల్లేనే ఒక్క బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నుంచే 22 వేల దరఖాస్తులు వచ్చాయని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 5న ప్రారంభమైన వీఆర్‌ఎస్ పథకం డిసెంబర్ 3వ తేదీన ముగియనుంది. తొలి రెండు రోజుల్లో వచ్చిన దరాఖాస్తుల్లో 13 వేల దరఖాస్తులు గ్రూప్ సి తరగతికి చెందిన ఉద్యోగులవేనని అధికారులు పేర్కొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం లక్షా యాభైవేల మంది ఉద్యోగులున్నారన్నారు. వీరిలో యాభై ఏళ్ల వయసు మీరిన లక్షమంది వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ఉండగా, వారిలో 70 నుంచి 80 వేల మంది వీఆర్‌ఎస్ తీసుకుంటారని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే జరిగితే సంస్థకు నెలకు ఏడువేల కోట్ల రూపాయల మేర వ్యయం తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.