తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి గుర్తింపే లేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది.
ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ప్రత్యుత్తరం రాసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
మరోవైపు, తెలంగాణలో సమ్మె బాటపట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈనెల 11లోపు సమస్యను పరిష్కరించాలని హైకోర్టు సూచించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షలు జరిపేకంటే జేఏసీ నేతలతో గంటన్నర పాటు చర్చలు జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
మూడున్నరగంటలపాటు సాగిన విచారణలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయన్నారు. ప్రభుత్వం తరపున హాజరైన ఐదుగురు ఐఏఎస్ అధికారులు సమర్పించిన ఆర్టీసీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నివేదికల పట్ల కోర్టు తీవ్రంగా ఆక్షేపించిందన్నారు. హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించిందన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా ఇలా చెబుతారని అనుకోలేదని కోర్టు పేర్కొందని ఆయన చెప్పారు.
తమ డిమాండ్లు నెరవేరేంతవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తమను ఈనెల 11లోపు చర్చలకు పిలవాలని ఆయన అభ్యర్థించారు. ఆర్టీసీ కార్మికులు పట్టు సడలించకుండా ధైర్యంతో సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 9న ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలు భారీసంఖ్యలో పాల్గొనాలని కోరారు.