మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ మరోమారు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీతో పాటు.. ముంబైలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై నితిన్ గడ్కరీ స్పందించారు.
తాను మహారాష్ట్ర తిరిగి వచ్చే ప్రసక్తే లేదనీ, ఢిల్లీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. 'మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆరెస్సెస్‌కిగానీ, మోహన్ భగవత్‌కి గానీ దీంతో సంబంధం లేదన్నారు.
పైగా, తమకు శివసేన మద్దతు ఉంది. వాళ్లతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. సీఎం పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని శివసేన ప్రతిపాదించడం... అందుకు బీజేపీ ససేమిరా అనడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది.
కాగా, మహారాష్ట్రలో పరిస్థితులను చక్కబెట్టేలా నితిన్ గడ్కరీకి బాధ్యతలు అప్పగించాలంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన నేత కిశోర్ తివారీ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8తో ప్రస్తుత అసెంబ్లీ గడువు సైతం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్‌తో సమావేశం అయ్యేందుకు గురువారం గడ్కరీ హుటాహుటిన నాగ్‌పూర్‌కు చేరుకున్నారు.