Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య -ప్రెస్‌రివ్యూ

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య -ప్రెస్‌రివ్యూ
, సోమవారం, 14 అక్టోబరు 2019 (12:57 IST)
శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్మికులు ఈ ఆవేదనలో ఉన్న సమయంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో ఆవేదనా భరిత ఘట్టాలివి. వాతావరణం గంభీరంగా మారిన పరిస్థితుల్లోనూ పట్టుదలలు కొనసాగుతున్నాయని ఈనాడు తెలిపింది.
 
నర్సంపేటలో ఒక డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. మరోవైపు తాత్కాలిక నియామకాల కోసం ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదివారం ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉద్ధృతం చేశారు. వంటావార్పు కార్యక్రమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు.
 
సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది.
 
సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. సమ్మె రాజకీయ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఆరోపించింది.కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని విపక్ష నేతలు, ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మృతికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లు సంతాపం తెలిపారు. అయితే కార్మిక సంఘాల నేతలే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు.
 
రెచ్చగొట్టిన వారే బాధ్యత వహించాలని మంత్రి దయాకర్‌రావు అనగా, కార్మికుల జీవితాలతో విపక్షాలు చెలగాటమాడుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారని ఈనాడు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ సమ్మె: తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం అవుతుందా?