సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే 58 లేదా 60 యేళ్లు హాయిగా ప్రశాంతంగా జీవితం సాగించవచ్చనే భరోసా ఉంటుంది. కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఉద్యోగాలు మానేసేందుకు క్యూ కట్టారు. వారు ఎవరో కాదు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన ఉద్యోగులు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. నష్టాల ఊబిలో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకం (వీఆర్ఎస్)ను ప్రకటించింది. అంతే... ఇప్పటికే నెలసరి వేతనాలు సరిగా అందక తల్లడిల్లిపోతున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు.. ఈ వీఆర్ఎస్ పథకాన్ని బంగారు అవకాశంగా మలచుకున్నారు.
ఈ పథకం ప్రకటించిన మరుక్షణం నుంచి వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కట్టారు. అలా ఇప్పటివరకు 70 వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు మానేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సంస్థలో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 77 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అర్హులు.
వచ్చే ఏడాది జనవరి 31 వరకు వీఆర్ఎస్ అమల్లో ఉండనుంది. మొత్తం 77 వేల మందికి వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ పీకే పుర్వార్ భావిస్తుండగా, ఇప్పటికే 70 వేల మంది ముందుకు రావడం గమనార్హం. వీఆర్ఎస్ కారణంగా ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోనుండడంతో నెట్‌వర్క్ పనితీరు దెబ్బతినకుండా చూడాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆపరేషన్స్ సాఫీగా సాగేలా చూడాలని టెలికం డిపార్ట్‌మెంట్‌ను బీఎస్ఎన్ఎల్ కోరింది.
బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం గత వారం ప్రారంభం కాగా, వచ్చే నెల 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 70-80 వేల మందిని వీఆర్ఎస్ ద్వారా బయటికి పంపితే వేతనాల రూపంలో రూ.7 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని సంస్థ అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్‌లో రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.