Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ఐటీ రంగ పితామహుడు కోహ్లీ ఇకలేరు!

భారత ఐటీ రంగ పితామహుడు కోహ్లీ ఇకలేరు!
, శుక్రవారం, 27 నవంబరు 2020 (06:31 IST)
భారతదేశ ఐటీ పరిశ్రమ పితామహుడుగా ఖ్యాతిగడించిన, టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫకీర్‌ చంద్‌ కోహ్లీ (ఎఫ్.సి.కోహ్లీ) గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 96 యేళ్లు. 'ఈరోజు మధ్యాహ్నం ఎఫ్‌సీ కోహ్లీ మృతి చెందారు' అని టీసీఎస్‌ ఓ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ఈయనకు సంజయ్ కోహ్లీ అనే కుమారుడు ఉన్నారు. ఈయన 1924 మార్చి 19న బ్రిటీష్‌ ఇండియా పెషావర్‌‌లో జన్మించారు. కాగా, కోహ్లీ మరణం పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 
 
1991లో టాటా - ఐబీఎం ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా ఐబీఎంను భారత్‌కు తీసుకురావడంలో ఎఫ్‌సీ కోహ్లీ కీలకపాత్ర పోషించారు. తద్వారా దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్‌ తొలి సీఈవోగా ఆయన అందించిన సేవలు.. 100 బిలియన్‌ డాలర్ల భారత ఐటీ పరిశ్రమ నిర్మాణానికి బలమైన పునాదులు వేశాయి. 
 
1951లో టాటా ఎలక్ట్రిక్‌ కంపెనీస్‌లో చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ 1970లో డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. ఇదేసమయంలో టీసీఎస్‌ ఆవిష్కరణలో భాగమయ్యారు. 1995-96లో నాస్కామ్‌ అధ్యక్షుడిగా కూడా ఎఫ్‌సీ కోహ్లీ సేవలందించారు. 75 యేళ్ల వయసులో 1999లో ఆయన రిటైర్‌ అవగా, ఆ తర్వాత కూడా దేశంలో నిరక్ష్యరాస్యతను రూపుమాపేందుకు శ్రమించారు. 
 
ఈ క్రమంలోనే 2002లో భారత ప్రభుత్వం ఎఫ్‌సీ కోహ్లీని పద్మ భూషణ్‌తో సత్కరించింది. దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయనకు భారత్‌సహా పలు దేశాల విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. కాగా, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీ హైదరాబాద్‌)లో ఎఫ్‌సీ కోహ్లీ గౌరవార్థం ఆయన పేరిట ఓ రిసెర్చ్‌ బ్లాక్‌ను టీసీఎస్‌ ఏర్పాటు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడేళ్ళ కుమారుడున్న ఏవో ఆత్మహత్య.. మంజీర నదిలో దూకి...