టెలికాం రంగంలో ప్రస్తుతం జియో దెబ్బకు వినియోగదారులకు ఆఫర్లు ఇచ్చేందుకు టెలికాం సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. ప్రైవేట్ టెలికాం రంగ సంస్థలతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్లను ఆకర్షించే దిశగా ప్లాన్స్ ప్రకటించనుంది. ఇందులో భాగంగా రోజూ పది జీబీ డేటాను చౌకధరలో అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కోల్‌కతా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ 4జీ సేవల్లో భాగంగా రెండు కొత్త డేటా రీఛార్జ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. అవేంటంటే? రూ.96, రూ.236 అనే రెండు కొత్త ప్లాన్స్.
రూ.96 ప్లాన్: ఈ ప్లాన్ ప్రకారం ఒక రోజుకు 10జీబీ డేటాను అందిస్తుంది బీఎస్ఎన్ఎల్. మొత్తానికి 280 జీబీ అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. అయితే బీఎస్ఎన్‌ఎల్ కాల్స్ బెనిఫిట్స్ వుండవు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
రూ. 236 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా రోజూ 10 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 84 రోజులు. మొత్తం 840 జీబీ డేటా లభిస్తుంది. కానీ కాల్స్‌పై ఆఫర్లు వుండవు. ఈ ప్లాన్ మొత్తం డేటాను వాడుకునేందుకు మాత్రమే వర్తిస్తుంది.