ఈ అక్టోబర్ నెలలో భారతదేశం ఎట్టకేలకు 5జి మార్కెట్ కానుంది. మరికొద్ది వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్‌లో మీరు 5జి ఐకాన్ చూడడం సాధ్యపడే అవకాశం ఉంది. జులైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన తరువాత, భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జిని వినియోగించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు.
జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా(వి)కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగరాలు మొదటగా 5జి సేవలను పొందనున్నాయి. తాము 5జి సేవలను అందించే విషయంలో కంపెనీలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అదే సమయంలో 5జి అనుభూతిని పొందేందుకు కస్టమర్లు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 5జికి సంబంధించి కస్టమర్లు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి.
5జి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? దాన్ని నేను ఎలా పొందగలుగుతాను? నాకు కొత్త ఫోన్ అవసరమవుతుందా? నేను ఏ ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ అవసరమవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో కొన్ని మాత్రం ముఖ్యమైనవే.
*నాకు 5జి అవసరమా?
జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం)తో హై- గ్రాఫిక్స్ గేమ్స్‌ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. 5జి కనెక్షన్ పొందడం అనేది టెంప్టింగ్‌గా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది క్యూరియాసిటీ వల్ల కావచ్చు లేదా తోటి వారంతా దాని గురించి ముచ్చటించుకోవడం నుంచైనా కావచ్చు.
హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యాక్సెస్‌ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం వేగవంతమైన నెట్ వర్క్ వేగాలు తమ మొబైల్ సేవలను మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్ డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. భారతీయ ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్ పరంగా చెప్పాలంటే, 5జి మార్కెట్లలో చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత 4జి కంటే కూడా 5జి వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.
మీరు గనుక అప్‌గ్రేడ్ కావాలనుకుంటే, భారతదేశంలో 4జి ప్రవేశపెట్టబడినట్లుగానే, 5జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. అప్పట్లో టారిఫ్‌లలో అగ్రెసివ్ ప్రైసింగ్ (ధరలు బాగా తక్కువగా ఉండడం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉండింది. ఈ రెండు అంశాలతో పాటుగా 5జికి గల డిమాండ్, దేశంలో 5జి సేవల ప్రోత్సా హకాలను ప్రభావితం చేయనున్నాయి. 2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేందుకు తన నూతన 4జి నెట్ వర్క్ పైన సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించింది. దీంతో 4జి మార్కెట్లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 5జి సేవలను అందించడంలో పోటీలో ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జి అప్‌గ్రేడ్ ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జి' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు.
నా ఫోన్ 5జికి సిద్ధంగా ఉందా?
మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సులభమార్గం ఉంది. 2019లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్‌ను లేదా మీ సిమ్ కార్డ్‌కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్‌ను పరిశీలించండి అది గనుక 5జిని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క.
ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జి ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను పరీక్షించుకుంటున్నారు. ఎంతోమంది భారతీయులు ఇప్పటికే 5జి సామర్థ్యం కలిగిన ఉపకరణాలు ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్‌ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, 5జి అప్‌గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జి అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్‌గా ఉంటోంది. మీ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో ఎక్కడా కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జిని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది.
కొత్త 5జి ఫోన్ అవసరమా?
అక్టోబర్ మొదలుకొని వచ్చే ఏడాది నాటికి వివిధ భారతీయ నగరాల్లో 5జి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు గనుక ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జి ఫోన్ ఉండాల్సిందే. 5జి ఫోన్‌ను కొనడం ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది.
దేశంలో 5జి మొదటగా ఆవిష్కరించబడే 13 నగరాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్దపెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి రానుంది. తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు రావచ్చు అన్న అంచనాతో టార్గెట్లపై ఆపరేటర్లు పని చేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్టెల్ ఉంది.
నా ముందున్న ఆప్షన్లు ఏంటి?
వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జి చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇది 5జి సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మి వంటి బ్రాండ్లు రూ.10,000 లోపుగానే 5జి ఫోన్లను అందించేందుకు వాగ్దానం చేశాయి. 5జి స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు గల ఫోన్ కోసం చూడాలి.
5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి?
కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జి తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జి అనేది నేడు ఫోన్లకు ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మారింది. రిటైల్ బాక్స్ లపై 5జి అని ముద్రించబడి ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే సరిపోదు. మరే ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలో చూద్దాం. 5-జి రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జి బ్యాండ్స్‌ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్ పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జి స్పెక్ట్రమ్ లో మూడు బ్యాండ్స్ ఉంటాయి, వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్, హై-బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHzను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్‌ను కలిగిఉంటుంది. దీన్ని mmWaveగా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.
5జి ఎంత వేగంగా ఉండవచ్చు?
ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్‌లు వినియోగదారులకు 1జీబీపీఎస్‌కు మించిన వేగాన్ని అందించగలుగుతున్నాయి. భారతీయ టెల్కోలు 4జి కన్నా అధికంగా డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాలను అందించేందుకు వాగ్దానం చేశాయి. అయితే, 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే గాకుండా, లొకేషన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది.
5జి ఫోన్‌లో 4జి సిమ్ కార్డ్ పని చేస్తుందా?
మీ ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ కొత్త 5జి ఫోన్‌లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS మరియు వాయిస్ కాలింగ్ వంటి 4జి మరియు 5జి సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జి సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జి, 3జి, 4జి, మరియు 5జి సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది.