Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"సింహం"లా గర్జించిన వాట్సన్.. విధ్వంసక శతకంతో సన్‌రైజర్స్‌ చిత్తు

షేన్‌ వాట్సన్ పరుగుల వరదలో సన్‌రైజర్స్‌ కొట్టుకుపోయింది. ఆ విధ్వంసం కూడా మామూలుగా లేదు. అరివీర భయంకరంగా సాగింది. ఆ వీరబాదుడుకు వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ జోరుకు సన్‌రైజర్స్‌ తల్లడిల్లిపోయింద

, సోమవారం, 28 మే 2018 (09:54 IST)
షేన్‌ వాట్సన్ పరుగుల వరదలో సన్‌రైజర్స్‌ కొట్టుకుపోయింది. ఆ విధ్వంసం కూడా మామూలుగా లేదు. అరివీర భయంకరంగా సాగింది. ఆ వీరబాదుడుకు వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ జోరుకు సన్‌రైజర్స్‌ తల్లడిల్లిపోయింది. పిసినారి హైదరాబాద్‌ బౌలర్లపై పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డాడు. మళ్లీ ఎప్పుడూ బంతి దొరకదేమోనన్నట్లు కసిదీరా బాదేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ కళ్లు మిరుమిట్లు గొలిపే షాట్లతో చిరస్మరణీయ శతకం సాధించాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2018 విజేతగా నిలిచింది.
 
నిజానికి సన్‌రైజర్స్ జట్టు బౌలర్ భువనేశ్వర్ ఏమాత్రం బ్యాటు ఝుళిపించనివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుంటే... షేన్ వాట్సన్ ఖాతా తెరవడానికి తడబడ్డాడు. మరో బౌలర్ సందీప్‌ శర్మ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో అంత అనుభవజ్ఞుడూ అపసోపాలు పడ్డాడు. మరో నాలుగు బంతులు కూడా పరుగుల్లేకుండానే గడిపాడు. అయినా వాట్సన్‌ నిరాశ చెందలేదు. ఏదో మొండి పట్టుదలతో నిలిచాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి చెన్నై ఛేదనలో పూర్తిగా వెనుకబడి పోయింది. 
 
కానీ ఆరంభం ఇబ్బందులను తట్టుకుని నిలిచిన వాట్సన్‌ ఆరో ఓవర్‌ నుంచి  బ్యాటు ఝుళిపించడం మొదలు పెట్టాడు. చిరు జల్లులా మొదలైన అతడి దూకుడు.. సునామీలా మారి సన్‌రైజర్స్‌ను ముంచేదాకా ఆగలేదు. ఓవర్‌ ఓవర్‌కూ జోరు పెంచుతూ.. కళ్లు చెదిరేలా, బ్యాట్లు పగిలేలా బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సన్‌రైజర్స్‌ ఆశలపై నీళ్ల చల్లాడు. సందీప్‌ వేసిన ఆరో ఓవర్లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టిన వాట్సన్‌ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. భారీ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. రైనా అతడికి చక్కని సహకారాన్నిచ్చాడు. 
 
ఓవర్లు పూర్తయ్యే కొద్దీ మ్యాచ్‌ చేజారుతుంటే బౌలర్లు నిస్సహాయులుగా చూస్తుండిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారు. లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను చాలా జాగ్రత్తగా ఎదుర్కొన్న వాట్సన్‌ మిగిలిన బౌలర్లను మాత్రం ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఊచకోత కోశాడు. సందీప్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో విశ్వరూపం చూపించాడు. 
 
వాట్సన్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో ఏకంగా 27 పరుగులొచ్చాయి. రైనా ఔటైనా చెన్నైకి కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. చివరి ఐదు ఓవర్లలో విజయానికి అవసరమైంది 34 పరుగులే. రాయుడుతో కలిసి వాట్సన్‌ అలవోకగా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. షేన్ వాట్సన్ మాత్రం 51బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో శతక్కొట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సన్ సిక్సర్ల వర్షం.. ఐపీఎల్ 2018 విజేత చెన్నై సూపర్ కింగ్స్