'శ్రీమతి కావాలి' చిత్రంతో నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైమ్‌లోనే ప్రముఖ హీరోలతో అందరూ మెచ్చే సినిమాలు చేస్తూ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఇలా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నసి.కళ్యాణ్ పుట్టినరోజు డిసెంబర్ 9. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత CK ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సి. కళ్యాణ్ ఇంటర్వ్యూ.
ఈ బర్త్‌డే స్పెషల్ ఏంటి?
గతేడాది నా 60వ పుట్టినరోజు వేడుకలు తాజ్ హోటల్‌లో చిరంజీవి, బాలకృష్ణ గారి ఆద్వర్యంలో సినీ ప్రముఖుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. నేనెప్పటికీ మర్చిపోలేని వేడుక అది. కాని ఈ సంవత్సరం నా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఏ చిత్ర సీమ నన్ను ఈ రేంజ్‌కి తీసుకవచ్చిందో.. ఆ ఇండస్ట్రీలో ఒక పెను తుఫానులాగా ఘోరాలు జరుగబోతుంటే వారం రోజుల క్రితం చివరి నిమిషంలో చిత్రపురి కాలనీలో సమస్యలను ఎదుర్కోవడానికి ఒక బాధ్యతను తీసుకోవడం జరిగింది.
దానికి కారణం ఏంటంటే.. ఆ కాలని వాసులు నా దగ్గరకు వచ్చి ఈ విషయం ప్రస్తావించినప్పుడు మీ దగ్గర కూడా చాలా తప్పులు ఉన్నాయి కదయ్యా అన్నాను. దానికి వారు `కళ్యాణ్ గారు ఇదే పెద్దాయన, గురువుగారు దాసరిగారు ఉండుంటే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇలా వదిలేసేవారా?` అని అన్నారు. ఆ మాటతో సరే నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మనం కష్టపడి పోరాటం చేసి చిత్రపురి కాలనీలోని మన సోదరులకి ఫేవర్ చేయగలిగితే వారే నెక్ట్స్ ఇయర్ నా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు అందుకే ఈ సారి బర్త్‌డే వేడుకల్ని ప్రక్కకు పెట్టడం జరిగింది. అలాగే ఈ కరోనా వల్ల నష్టపోయిన సినీ కార్మికులకి చిరంజీవి గారి సహకారంతో సి.సి.సి ద్వారా కొంత చేయగలిగిన ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రెండు విషయాల్ని దృష్టిలో పెట్టకుని నా పుట్టినరోజు వేడుకల్ని కరోనాకు అంకితం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు చాలా బాధ్యతాయుతమైన పుట్టిన రోజు.
ప్రొడ్యూసర్‌గా మీ నెక్ట్ ప్లాన్స్ ఏంటి?
రానా దగ్గుబాటి, సత్యదేవ్, రెజీనా, నాజర్, సప్తగిరి ప్రధాన పాత్ర దారులుగా 1945 లవ్‌స్టోరీ అనే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిలిం చేయడం జరిగింది. ఏప్రెల్ నెలలోనే విడులదల చేయాలనుకున్నాం కాని కరోనా కారణంగా వాయిదాపడింది. మంచి ఎమోషన్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సత్యశివ అద్భుతంగా తెరకెక్కించారు. అది విడుదలకు సిద్దంగా ఉంది.
అలాగే సత్యదేవ్ హీరోగా బ్లఫ్ మాస్టర్ ఫేమ్ గణేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాం. ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభంకానుంది. వీటితో పాటు కె.ఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో ఒక స్టార్ హీరోతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బాలకృష్ణ గారితో ఒక సినిమా ఉంది. CK ఎంటర్టైన్‌మెంట్స్‌ని బాలకృష్ణగారు తన సొంత బ్యానర్ అనుకుంటారు. నేను ఆయన ఇంటి ప్రొడ్యూసర్‌లా ఫీలవుతుంటాను. బాలకృష్ణ గారితో జర్నీ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది అని చెప్పారు.