వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నేచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నేచురల్‌స్టార్ నాని. రీసెంట్‌గా నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. ట్రైలర్‌కు, పాటలకు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19న జెర్సీ విడుదలవుతున్న సందర్భంగా నేచురల్ స్టార్ నానితో ఇంటర్వ్యూ మీకోసం...
రామణ్ లాంబా లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ సినిమా చేశారా?
జెర్సీ ఎవరి బయోపిక్ కాదు. పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. టీజర్, ట్రైలర్ చూసి అలా అనుకున్నారేమో. ఒకవేళ రామణ్ లాంబా కూడా క్రికెట్ నుంచి బయటకు వెళ్లి మళ్లీ కమ్‌బ్యాక్ అయ్యారేమో. ఒకవేళ ఆ విషయానికి దగ్గరగా ఉందని అందరూ అలా అనుకుంటున్నారేమో. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కి… కాపీ పేస్టులు జరిగి నా వరకు కూడా చేరింది. మా ‘జెర్సీ’ బయోపిక్ కాదు. ఫిక్షనల్ స్టోరీ.
‘జెర్సీ’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
‘జెర్సీ’ అంటే ఎనీ స్పోర్ట్స్‌మేన్ వేసుకునే యూనిఫార్మ్. కేవలం క్రికెట్ స్టోరీ కాబట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టామని మాత్రం అనుకోవద్దు. ఇందులో జెర్సీ అనే టైటిల్‌కు చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అదేంటన్నది ఏప్రిల్ 19న సినిమా చూశాకే తెలుస్తుంది.
ఇటీవల నాగ చైతన్య కూడా ‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించారు. ఈ రెండు చిత్రాల మధ్య పోలికలుంటాయా?
మజిలీ చూడలేదు కాబట్టి, నేను ఆ సినిమాకు, ఈ సినిమాకు మధ్య ఉన్న పోలికలను గురించి చెప్పలేను. పైగా శివ మావాడు. ‘నిన్ను కోరి’తో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఎప్పటికప్పుడు టీజర్లు, ట్రైలర్లు పంపించేవాడు. నాకు చాలా చాలా నచ్చేశాయి అవన్నీ. నిజంగా ‘జెర్సీ’ ప్రమోషన్స్, ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ లేకుండా ఉంటే ఎప్పుడో వరుసగా సినిమాలు చూసుండేవాడిని.
పోలికలు వస్తాయని అనుకుంటున్నారా?
మా సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి అలా అనుకుంటున్నారేమోగానీ, విడుదల తర్వాత అసలు వస్తాయని నేను అనుకోను.
అర్జున్ సక్సెస్‌ఫుల్ క్రికెటరా? ఫ్రస్ట్రేటెడ్ క్రికెటరా?
రెండూ కావచ్చు. రెండూ కాకపోవచ్చు. ట్రైలర్‌లోనే సినిమా కథకు సంబంధించి చాలా చెప్పేశాం. లూసర్ అనడం, తక్కువ చేసి మాట్లాడటం వంటివన్నీ ఉంటాయి. వాటివల్ల ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల అర్జున్ జీవితంలో ఏం జరిగిందనేది కథ.
మీరు క్రికెట్ ఆడేవారా?
నేను గల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్‌మేన్‌ని. కొన్ని సార్లు నా టీమ్లో అందరూ ఓడిపోతేనో, లేకుంటే ఎవరికో ఒకరికి దెబ్బలు తగిలితేనో నాకు అవకాశం వచ్చేది. ఆ బ్యాచ్ అన్నమాట.
ఈ సినిమా చూశాక క్రికెట్ పట్ల మీ దృక్పథం మారిందా?
చాలా మారింది. ఇంతకు ముందు క్రికెట్ ఛానెల్‌లో వస్తుంటే నేను రిమోట్ నొక్కేసేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. చూస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా కోసం ట్రయినింగ్ తీసుకున్న తర్వాత నాకు క్రికెట్ పట్ల అవగాహన పెరిగింది. క్రికెట్ అంటే కేవలం బ్యాట్‌తో బాల్‌ను కొట్టడం కాదు, ఫోర్లు, సిక్సులను మించింది ఇంకేదో ఉందని అర్థం చేసుకున్నా. బాడీ లాంగ్వేజ్ నుంచి ఎన్నో విషయాలను గురించి తెలుసుకున్నా.
ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు?
డేనియల్ అని సిటీలో బెస్ట్ క్రికెట్ అకాడెమీ ఒకటి ఉంది. డేనియల్ నాకు శిక్షణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్‌కి కూడా ఆయనే వచ్చారు.
ఇందులో మీ పేరు అర్జున్, మీ అబ్బాయి పేరు నాని…
నిజమే. గౌతమ్ ఈ సినిమాను రాసుకున్నప్పుడు కూడా ఈ పేర్లతోనే రాసుకున్నాడట. ఆ ప్రకారమే కంటిన్యూ అయిపోయారు. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.
మీ గత చిత్రాలకు ఇంత కాన్ఫిడెంట్‌గా ఎప్పుడూ మాట్లాడలేదు కదా?
నాకు నా బలాలు, బలహీనతలు బాగా తెలుసు. అందుకే ఈ సినిమా విషయంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నేనిప్పుడు చాలా హైలో ఉన్నా. చాలా శాటిస్‌ఫైడ్ సినిమా ఇది. చాలా గొప్ప సినిమా చేశామనే ఫీలింగ్ ఇప్పటివరకూ నాకు రాలేదు. ఈ సినిమాతోనే వచ్చింది.
సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది?
పాయింట్ అని కాదు. అతను చెప్పిన నెరేషన్‌లో పాత్రలో నేను లీనమైపోయాను. అసలు లాజిస్టిక్స్‌ని నేను ఊహించలేదు. అంత టైమ్ కూడా లేదు. నేనే కాదు, ఈ సినిమా చేసిన వారందరూ చాలా గొప్ప పని చేశామనే ఫీలింగ్‌లో ఉన్నారు. సంతోషంతో కళ్లల్లో నీళ్లు తిరిగే సీన్లు కూడా ఉన్నాయి.
హ్యాపీ ఎండింగేనా?
వంద శాతం హ్యాపీ ఎండింగే. అందరూ ఒక ఎగ్జయిట్‌మెంట్‌తో బయటికి వస్తారు.
సీక్వెల్ ఛాన్స్ ఉందా?
లేదండీ. ఇందులో లేదు.
‘మళ్లీ రావా’ చూశారా?
చూడలేదు. కాకపోతే అతను చెప్పిన కథ నచ్చింది. అతనిలో నిజాయతీ నచ్చింది. అందుకే నేను అతని ప్రీవియస్ సినిమా చూసి జడ్జి చేయాలని అనుకోలేదు.
సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
చాలా హైగా అనిపించింది. ఏదో గొప్ప సినిమా చేస్తున్నామనే ఫీలింగే వచ్చింది. ఇంతకు ముందు కూడా చాలా ఎమోషన్ ఉన్న సినిమాలు చేశా. ‘నిన్ను కోరి, ఎవడే సుబ్రమణ్యం’ అవన్నీ వేరే తరహా సినిమాలు. అందులో ఏదో ఒక డిస్కషన్ ఉంది. దీనికీ, వాటికీ తేడా ఉంది.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘భీమిలి’ చేసి తొమ్మిదేళ్లు అవుతోంది. మధ్యలో ఎవరూ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రాలేదా?
వచ్చినా నచ్చాలి కదా. జోనర్‌లో ఐడియాలు నచ్చితే సరిపోదు. వాటిని ఎంత బాగా ట్రీట్ చేశారనేది కీలకం. అలాంటి కథను నాకు గౌతమ్ చెప్పాడు. ఐడియాను రెండున్నర గంటల ఫార్ములాలో అద్భుతంగా చెప్పాడు. ఇప్పుడు నచ్చింది. చేస్తున్నా.
యంగ్ ఏజ్‌లో ఫాదర్‌గా నటించారు కదా! ఏమైనా ఇబ్బంది అన్పించిందా?
ఏం ఇబ్బంది లేదు. నన్ను నిజంగా ముసలివాడిగా వేయమన్నా, ప్రాస్తటిక్ మేకప్ వేసుకోమన్నా సిద్ధంగానే ఉన్నా. నటుడిగా నాది కాని వయసులో నటించడానికి చాలా ఆనందిస్తా.
కావాలనే బరువు తగ్గారా?
ఈ సినిమా కోసం తగ్గలేదు. కాకపోతే రిహార్సల్స్ వంటివి చేస్తుంటే తగ్గానంతే.
షూటింగ్ సమయంలో… చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి.
‘భీమిలి కబడ్డీ జట్టు’ అప్పుడు రోజూ కాళ్లు కొట్టుకుపోయేవి. అప్పుడు మీడియాగానీ, సోషల్ మీడియాగానీ ఇంత స్ట్రాంగ్‌గా లేదు. అందువల్ల ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అంత భారీగా పెరగడంతో దెబ్బ తగిలింది అని అనగానే… తగిలిందట తగిలిందట అనేది పెద్ద న్యూస్ అవుతోంది. అప్పట్లో ఇంత డిస్కషన్ లేదు.
మీ అబ్బాయి మిమ్మల్ని జడ్జి చేస్తాడా?
ప్రతి తండ్రీ ప్రపంచం ద ష్టిలో ఏమైనా ఫర్వాలేదు కానీ, కొడుకు ద ష్టిలో మాత్రం హీరో కావాలనుకుంటాడు. అందుకే జెర్సీలో ఆ డైలాగ్ అంత హిట్ అయింది. మా అబ్బాయికి ఇంకా నన్ను జడ్జి చేసే వయసు రాలేదు.
సత్యరాజ్‌గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఆయనతో పనిచేయడం పెద్ద లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. చాలా సందర్భాల్లో ఆయనకు చాలా చిన్న డైలాగులే ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం ఆయనకు ఒక చిన్న డైలాగ్ ఉంది. ఆ విషయం తెలిసి మదురైలో షూటింగ్ చేస్తున్న ఆయన అక్కడి నుంచి చెన్నైకి కారులో వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చారు. తీరా వచ్చేసరికి ఇక్కడ షాట్ లేదు. అయినా ఆయన డిజప్పాయింట్ కాలేదు. నేనే కేర్‌వ్యాన్‌లోకి వెళ్లి సారీ చెప్పా. అయినా ఆయన ‘ఇందులో ఏముంది’ అని చాలా కూల్‌గా చెప్పారు. ఇన్నేళ్ల నటనా కెరీర్‌లో ఆయన అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా సంతోషంగా, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్నట్టుగా అనిపించింది.
స్టార్‌డమ్‌ని నమ్ముతారా?
కచ్చితంగా. స్టార్‌డమ్ మీద నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పటిలాగా అందరూ నమ్మే స్టార్‌డమ్ మీద కాదు. కంటెంట్ వల్లే స్టార్‌డమ్ వస్తుందని నమ్ముతా.
కెరీర్‌ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు..
అలాంటిదేమీ లేదు. నా వరకు వచ్చిన వాటిలో నాకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేస్తున్నా. నాకు అర్థమైన రీతిలో ముందుకు సాగుతున్నా. అది నాకే తెలియకుండా నా కెరీర్‌కి ఉపయోగపడుతోంది. నేనేం చేసినా నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, నాకు అర్థమైంది కాబట్టి చేస్తున్నా.
సినిమా, సినిమాకూ మీమీద ప్రెజర్ పెరగడం లేదా?
సినిమా సినిమాకు ఎదగడం అనేది నాకేమీ ప్రెజర్‌గా లేదు. ‘ఎంసీఏ’ తర్వాత బాగా ప్రెజర్ ఫీలయ్యా. ఇప్పుడు లేదు. ఒకప్పుడు ‘జెండాపై కపిరాజు, పైసా, అహనా కల్యాణం’ అన్నీ ఫ్లాపులే. ఆ సమయంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి కథను అంగీకరించాను. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్లానంతే. నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రెజర్ ఎందుకు?
వెబ్‌సీరీస్‌లు చూస్తారా?
తప్పకుండా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో వెబ్‌సీరీస్ అనేది చాలా దూరం వెళ్తుంది. దాని భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మెయిన్ ప్రొడక్షన్ హౌస్‌లు అందరూ సినిమా, వెబ్‌సీరీస్‌లు చేస్తున్నారు. నా దగ్గర అలాంటి కంటెంట్ లేదు. ఉంటే నా ప్రొడక్షన్ హౌస్‌లోనూ చేస్తానేమో.
ఇంద్రగంటిగారు ఆడియో వేడుకలో మిమ్మల్ని స్టార్ మెటీరియల్ అన్నారు కదా!
‘అషాచెమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు నన్ను చూసి అప్పుడు స్టార్ మెటీరియల్ అని చెప్పారు. కానీ అప్పుడు నేను నమ్మలేదు. ఆ సినిమా చేస్తున్నంత కాలం నాకు డౌటే. ఆయనకు నాలో ఏదో నచ్చింది కాబట్టి సినిమా చేశారు కానీ, ఈ సినిమాకు ఎవరూ రారేమో అని అనుకునేవాడిని. కానీ తొలిరోజు నా డౌట్స్ క్లియర్ అయిపోయాయి.
ఓవర్సీస్ మార్కెట్ వల్ల మనకు ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి వీలవుతుందా?
ఓవర్సీస్ మార్కెట్ అనేది ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలను అప్రిషియేట్ చేసేది కాదు. వాళ్లు ప్రాపర్ కమర్షియల్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. మనం చెప్పాలనుకున్న కథలు కరెక్ట్‌గా చెప్పడానికి ఓవర్సీస్ మార్కెట్, తెలుగు మార్కెట్ ను ఎక్స్‌పాండ్ చేస్తుంది.
మీరు ‘అష్టాచెమ్మా’లో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారే?
లేదండీ. అప్పటికీ, ఇప్పటికీ చాలా మారాను. ఇప్పుడు ఇలా చూస్తుంటే తెలియదు కానీ, వీడియోలో ‘అష్టాచెమ్మా’ చూస్తేంటే మాత్రం చాలా మారానని తెలుస్తుంది.
రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారా?
ఆరునెలలకు ఒకసారి ఎప్పుడో బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా లావైపోయావు అని అంటే వేగంగా వచ్చి వారం రోజులు జిమ్ చేస్తాను. అంతేగానీ ఆ తర్వాత మానేస్తాను.
మీరు రెమ్యూనిరేషన్ కూడా బాగా పెంచినట్టున్నారు?
మీరు చెప్పండి.. ఎంత పెంచి ఉంటానో (నవ్వుతూ). సినిమాను బట్టి మారుతుంటుందండీ.