Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ సహా 4 దేశాల రాయబారులన్ని తొలగించిన ఉక్రెయిన్

Zelenskyy
, ఆదివారం, 10 జులై 2022 (14:13 IST)
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిపించారు. అయితే, ఈ తరహా కీలక నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. 
 
జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌, నార్వే-హంగేరీ, భారత్‌కు చెందిన రాయబారులను వెనక్కి పిలిచినట్లు అధ్యక్ష అధికారిక వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు. అయితే, వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
 
గత ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ప్రపంచదేశాల మద్దతు కూడగట్టాలని జెలెన్‌స్కీ ఆయా దేశాల్లోని తమ రాయబారులను ఆదేశించారు. అయితే, కొన్ని దేశాలు వారి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యా దాడిని బహిరంగంగా ఖండించడానికి ముందుకు రాలేదు. 
 
యుద్ధాన్ని ఆపి సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాత్రం కోరాయి. రష్యా దాడిని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు భారత్‌ తటస్థంగా ఉండిపోయింది 
 
మరోవైపు ఇంధన అవసరాల కోసం జర్మనీ పెద్దఎత్తున రష్యాపై ఆధారపడుతోంది. దీంతో ఆ దేశం సైతం రష్యాను ఖండించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్‌ సరఫరా కోసం కావాల్సిన టర్బైన్‌ ఒకటి కెనడాలో మెయింటెనెన్స్‌లో ఉంది. దాన్ని తిరిగి రష్యాకు ఇవ్వాలని జర్మనీ పట్టుబడుతోంది. 
 
జెలెన్‌స్కీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ టర్బైన్‌ను రష్యాకు తరలించొద్దంటున్నారు. అలా చేస్తే రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపారు. ఈ తరుణంలో జెలెన్‌స్కీ రాయబారుల్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు రెండో విడత జనవాణి కార్యక్రమం ప్రారంభం