Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌లో అస్థిరత - ప్రభుత్వ సలహాదారుడుగా నోబెల్ బహుమతి గ్రహీత!!

Muhammad Yunus

వరుణ్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:55 IST)
బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లకు వర్తింపజేయడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఆ దేశంలో అల్లర్లకు దారితీసింది. నిరుద్యోగులంతా ఆందోళనకు దిగడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఫలితంగా ఆ దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా దేశం విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆమెకు భారత్ తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సైనిక నియంత్రణలోకి వెళ్లిపోవడంతో పాటు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. 
 
ఈ కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్‌ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తలు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ నిరసన నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయననే సలహాదారుడిగా నియమించడం దాదాపు ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
 
కాగా, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో 1940లో మహ్మమద్‌ యూనస్‌ జన్మించారు. సామాజిక కార్యకర్త, బ్యాంకర్‌, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్‌ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారనే ఘనత సాధించారు. దానికిగానూ 2006లో యూనస్‌ నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. దీంతోపాటు 2009లో యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌, 2010లో కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు.
 
2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా పని చేశారు. గతంలో చిట్టగాంగ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేశారు. బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు పేదలకి దీర్ఘకాలిక రుణాలను అందించారు. ఇది గ్రామీణంలో బ్యాంక్‌ స్థాపనకు దారి తీసింది. ఇది ఎంతో మందిని పేదరికం నుంచి బయటపడేందుకు సహాయపడింది. జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తన వంతు కృషి చేసినందుకుగానూ ఆయనను నోబెల్‌ బహుమతి వరించింది.
 
కాగా.. హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్‌లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్‌ హసీనా దేశాన్ని వీడిన అనంతరం సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఆమె భారత్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షేక్‌ హసీనా నివాసంలో నిరసనకారులు.. చీరలు, జాకెట్లు, లోదుస్తుల్ని కూడా వదల్లేదు..