ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా దాడుల నుంచి తప్పించుకుని పొరుగు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆశ్రయం కల్పిస్తామన్న పేరుతో కొందరు కేటుగాళ్లు అమ్మాయిలను చేరదీసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. తద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం విస్మయానికి గురిచేస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరర్స్ కూడా ప్రస్తావించారు.
ఉక్రెయిన్ సరిహద్దులు దాటగానే అక్కడే వాలంటీర్ల ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. ఆ పై వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారని సమాచారం. ఇక వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు పురుషులు స్విట్జర్లాండ్‌లో ఆశ్రయం కల్పిస్తామని చెప్పి వారిని ఓ వ్యాన్‌లో తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళ ఎదుర్కొంది.
వాలంటీర్లు చూసే చూపుతో తనకు అనుమానం వచ్చిందని వెంటనే వారి ఐడీలను చూపించాల్సిందిగా కోరగా అందుకు వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మహిళ పేర్కొంది. అనుమానం బలపడటంతో తన కూతురును తీసుకుని వేరే చోటికి పరుగులు తీసి తప్పించుకుందని చెప్పుకొచ్చింది.
ఇలా ప్రాణాలు చేతిలో పెట్టుకుని రష్యా దాడుల నుంచి తప్పించుకుని సరిహద్దులకు చేరిన ఇలాంటి మహిళలను కొందరు కేటుగాళ్లు వ్యభిచార కూపంలోకి దింపుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఐక్యరాజ్యసమితి వెంటనే చర్యలు తీసుకోవాలని పలు ప్రజాసంఘాలు, అంతర్జాతీయ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.