భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు హెచ్చరిక చేశారు. మున్ముందు భారత్‌కు పన్నుల పోటు తప్పదని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో భారత్‌పై పన్నుల భారాన్ని మరింతగా పెంచుతామని ఆయన హెచ్చరించారు. ఇటీవల భారతైపై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ట్రూత్'లో పోస్ట్ చేశారు.
రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో చమురు విక్రయించి భారత్ లాభం పొందుతోందని ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపడం లేదని ట్రంప్ విమర్శించారు. రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్లకు అవసరం లేదన్నారు. అందుకే భారత్‌పై సుంకాలను మరింత పెంచబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్‌పై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని మరోసారి ప్రస్తావించారు. వారణాసిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతలో ఉందని, ఇలాంటి సమయంలో ప్రతి దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి వేగంగా పయనిస్తోందని, అందుకే మనమూ మన స్వదేశీ ప్రాధాన్యతను మరువకూడదని పిలుపునిచ్చారు.