Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రంప్ సర్కారుకు అమెరికా ఫెడరల్ కోర్టులో షాక్

Advertiesment
donald trump

ఠాగూర్

, గురువారం, 4 సెప్టెంబరు 2025 (12:50 IST)
ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి కేటాయించిన బిలియన్ల డాలర్ల పరిశోధన నిధులను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. యూదు వ్యతిరేకతను (యాంటీ-సెమిటిజం) ఒక సాకుగా చూపి, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం సైద్ధాంతిక దాడికి పాల్పడిందని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ మసాచుసెట్స్ జడ్జి అల్లిసన్ బరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఈ యేడాది ఏప్రిల్ 11న ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పలు డిమాండ్లతో కూడిన లేఖను పంపింది. క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను అరికట్టాలని, కొన్ని మైనారిటీ వర్గాలకు అనుకూలంగా ఉండే వైవిధ్య (డైవర్సిటీ), ఈక్విటీ, ఇన్ క్లూజన్ (డీఈఐ) కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించింది. 
 
అయితే, ఈ డిమాండ్లను హార్వర్డ్ తిరస్కరించడంతో ఏప్రిల్ 14న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. బహుళ-సంవత్సరాల గ్రాంట్ల కింద రావాల్సిన 2.2 బిలియన్ డాలర్లతో పాటు, 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు విలువను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
 
ప్రభుత్వ చర్య అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ, పౌర హక్కుల చట్టంలోని టైటిల్ ఆరో నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని జడ్జి బరోస్ తన తీర్పులో పేర్కొన్నారు. "మనం యూదు వ్యతిరేకతపై పోరాడాలి. ఆ సమయంలో మన హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలి. ఒకదాని కోసం మరొకదాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
ఆలస్యంగానైనా హార్వర్డ్ ద్వేషపూరిత ప్రవర్తనను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటోందని, రాజ్యాంగం ప్రకారం విద్యా స్వేచ్ఛను కాపాడటం కోర్టుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విచారణ లేకుండానే హార్వర్డ్‌కు అనుకూలంగా ఆమె తీర్పు ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ పన్ను విధానంలో భారీ మార్పులు - లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను: కేంద్రం నిర్ణయం