భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని భావించే విద్యార్థులకు గత యేడాదికి మించి అధిక సంఖ్యలో వీసాలను జారీ చేయనున్నట్లు ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారిణి పాట్రిసియా లసినా తెలిపారు.
గత 2021 వేసవిలో కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని, ప్రస్తుత ప్రవేశాల కోసం లక్ష దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన 6వ విద్యార్థి వీసాల దినోత్సవంలో ఆమె ఈమేరకు మాట్లాడారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, "అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు మా దేశం ఎంతో విలువనిస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారు' అని తెలిపారు.