ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కథ ఇక ముగిసినట్టేనని జర్మన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త (వైరాలజిస్ట్) క్రిస్టియన్ డ్రోస్టెన్ అభిప్రాయపడ్డారు. ఇది ఇపుడు ఎండమిక్ దశకు చేరుకుందని తెలిపారు. "సార్స్ కోవ్-2 ముగింపు దశను ఈ శీతాలంలో చూడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో ఈ వ్యాధి నిరోధక శక్తి మరింతగా బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
బెర్లిన్ చారైట్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో వైరాలజిస్టుగా పని చేస్తున్న ఈయన.. కరోనా ఎండమిక్ గురించి మాట్లాడుతూ, వచ్చే వేసవిలో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువేనని చెప్పారు. ప్రస్తుతం ఈ మహమ్మారి ఉధృత రూపంలో ఉందని చెప్పారు. ప్రజల్లో బలమైన ఇమ్యూనిటీ ఏర్పడిందని చెబుతూ, ఐసీయూల్లో చేరేవారు కొద్ది మందే ఉన్నట్టు చెప్పారు. జర్మనీ ఇతర యూరప్ దేశాల్లో చేపట్టిన టీకాల కార్యక్రమం వల్లే వైరస్ ముగింపు దశకు చేరినట్టు చెప్పారు.
కాగా, భారత్‌లో కరోనా వైరస్ ముగింపు దశకు చేరిందనే అభిప్రాయాన్ని పలువురు వైద్య నిపుణులు గతంలోనే వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన కరోనా మూడు దశల్లో దేశంలో మెజారిటీ ప్రజలు వైరస్ బారిన పడటం, కేసుల సంఖ్య లక్షల నుంచి వందల్లోకి పడిపోవడం, టెస్టుల కోసం ప్రజలు రాకపోవడం, మాస్కులు ధరించడాన్ని తొలగించడం ఇవన్నీ కరోనా బలహీనపడిందనడానికి సంకేతాలని చెబుతున్నారు. మరోవైపు, ఇంతకాలం లాక్డౌన్ అమలు చేసిన డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం ఇపుడు తీవ్ర దశకు చేరుకుందని తెలిపారు.