తైవాన్‌లోకి మళ్లీ చైనా వైమానిక దళం చొరబడింది. చైనాకు చెందిన 38 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు తైవాన్ ఆరోపించింది. ఒక్క నెలలోనే 60 సార్లు సరిహద్దులను దాటి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) రికార్డు సాధించింది.
అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల హెచ్చరికల తర్వాత కూడా తైవాన్‌ను భయపెట్టడం చైనా ఆపక పోవడం గమనార్హం. చైనా తమ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 న 38 ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు నిర్వహించింది. ఈ సమయంలోనే ఈ జెట్‌లు తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించాయి.
తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, చైనా 18 జే-16 లు, 4 సుఖోయ్-30 విమానాలు, అణుబాంబులు జారవిడిచే సామర్థ్యం ఉన్న రెండు హెచ్-6 బాంబర్లతో ప్రదర్శన నిర్వహించి తైవాన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నించింది. తైవాన్ కూడా ధీటుగానే ప్రతిస్పందించింది.
చైనీస్ జెట్‌లను పర్యవేక్షించేందుకు తైవాన్ క్షిపణి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. తైవాన్ నైరుతిలో చైనా చొరబాట్ల గురించి తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా చైనీస్ ఎయిర్ ఫోర్స్ చొరబాటుపై తైవాన్ ఫిర్యాదు చేస్తున్నది. అయితే, ఈ విషయంలో చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయక పోవడం గమనార్హం.