అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల్లోపే ఉక్రెయిన్‌పై చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటించారు. ఉక్రెయిన్ విషయంపై ఇంతకాలం వెనక్కి తగ్గని పుతిన్.. ట్రంప్ ఎఫెక్టుతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాము ఎల్లప్పుడూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని.. ఉక్రెయిన్ విషయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈలోగా, కొన్ని సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గతంలో ఇటువంటి చర్చలను నిషేధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారని ఆయన గుర్తుచేసుకున్నారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అంతేకాదు, 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గనక విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కానీ, అమెరికాతో సంప్రదింపులు విషయమై మాత్రం పుతిన్ స్పష్టతనివ్వలేదు. వాషింగ్టన్ నుంచి పిలుపుకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పుతిన్ అన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ట్రంప్ స్పందించారు. సంఘర్షణ ముగించేలా పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ స్పందిస్తూ.. చర్చల్లో ఎటువంటి మినహాయింపులు ఉండబోవని హెచ్చరించింది. ఐరోపా లేకుండా యూరప్ గురించి చర్చలు జరిపితే కుదరదు. పుతిన్ వాస్తవికతకు తిరిగి రావాలి.. లేకుంటే ఆయన్ను తిరిగి తీసుకొస్తాం.... ఆధునిక ప్రపంచంలో ఇది కుదరదు" అని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం చీఫ్ ఆండ్రీ యెర్మాక్ స్పష్టం చేశారు.