తన అత్త మామలు మగపిల్లాడినే కనాలని ఆ గర్భవతిపై ఒత్తిడి తెచ్చారు. అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్నది ఆ మహిళ. దాంతో ఆస్పత్రి నుంచి ఓ పసి బాలుడిని అపహరించింది.
ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే రాల్లోకెళ్తే కరాచీకి చెందిన ఒక మహిళ 37 వారాల గర్భిణీ. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. దాంతో మగపిల్లవాడి కోసం తన భర్త, అత్త మామలు ఒత్తిడి చేశారు.
అయితే తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్న ఆమె ఈ నెల 23న స్థానిక మాతాశిశు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పారు.
ముందు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆ మహిళ అనంతరం ఓ పసి బాలుడిని అపహరించి ఇంటికి వెళ్లింది. తమ శిశువు కనిపించకపోవడంతో ఆ పసి బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ మహిళను గుర్తించి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.