అలస్కా వణికిపోయింది. అలస్కా దక్షిణ తీరంలో మంగళవారం రాత్రి పెను భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి దేశవ్యాప్తంగా ఎన్నో జాతీయ రహదారులు దెబ్బతినగా, వేల కొద్దీ భవనాలు నెలమట్టమయ్యాయి.
ఈ భూకంప కేంద్రాన్ని తీరం నుంచి ఆగ్నేయ దిశగా, సముద్రంలో 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ల లోతున సంభవించినట్టు గుర్తించారు. దీంతో అలస్కాలో సునామీ హెచ్చరికలను కూడా జారీచేశారు.
అలాస్కా కాలమానం ప్రకారం, మంగళవారం రాత్రి భూకంపం సంభవించగా, ఇప్పుడు సోషల్ మీడియా భూకంపానికి సంబంధించిన చిత్రాలతో నిండిపోతోంది. ప్రాణ నష్టం జరుగకపోయినా, ఆస్తి నష్టం మాత్రం చాలా అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలలో చాలామందికి దీని తీవ్రత పెద్దగా తెలియలేదని భూకంప పరిశోధకుడు మైకేల్ వెస్ట్ వెల్లడించారు. అలాస్కాకు 160 కిలోమీటర్ల పరిధిలో వున్న వారికి ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని, ఆపై 805 కిలోమీటర్ల వరకూ ఉన్న వారు భూకంపం వచ్చినట్టు గ్రహించారని వెల్లడించారు.