మూడు రోజులు అధికారిక పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్‌లో అడుగుపెట్టారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో మోడీకి స్వాగతం పలికారు. మూడు రోజులపాటు అక్కడ ఆయన పర్యటన కొనసాగనుంది.
ఈ పర్యటన అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగుతుంది. అలాగే, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, క్వాడ్ సదస్సుల్లో కూడా ప్రధాని మోడీ పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ప్రధాని సమావేశమవుతారు.
ఈ సందర్భంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలు తదితర అంశాలపై వారితో మోడీ చర్చించనున్నారు. ముఖ్యంగా ఆప్ఘన్ పరిణామాలపై బైడెన్ - మోడీల మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈనెల 26న ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు.