సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణుడి దగ్గర నిజంగానే విమానం ఉందా అనే అంశంపై శ్రీలంక ప్రభుత్వం పరిశోధనలను ముమ్మరం చేసింది. ఒకవేళ రావణుడి దగ్గర నిజంగానే విమానం ఉంటే ప్రపంచలోనే తొలి ఏవియేట్ అతడే అవుతాడు.
ఈ విషయాన్ని కనిపేట్టేందుకు శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఇందుకోసం భారత్ సాయాన్ని కూడా కోరింది. ఇతిహాసం రామాయణంలో శ్రీరాముడిని భారతీయులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఇందులో విలన్ అయినా రావణాసురుడిని కూడా శ్రీలంక వాసులు దేవుడిలా పూజిస్తుంటారు.
లంకకు అధిపతైన రావణుడుకి సంబంధించి అనేక చారిత్రక ఆధారాలు ఇప్పటికే లభించాయి. ఆయనది కల్పిత పాత్ర కాదని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ఇతిహాసాలో పేర్కొన్న విధంగా రావణుడి దగ్గర నిజంగానే విమానాలు ఉన్నాయి అంటూ శ్రీలంక ప్రజలు నమ్ముతుండగా.. మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే దీనిలో నిజమెంత అని తెలుసుకోవాలనుకుంది శ్రీలంక ప్రభుత్వం. అందుకు ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల కిందట పరిశోధనలు ఆగిపోయాయి.
అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో పరిశోధనలు ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రావణుడుకి సంబంధించి చారిత్రక ఆధారాల సేకరణ చేపట్టామని ఏవియేషన్ నిపుణుడు, శ్రీలంక క్రికెట్ బోర్డు మాజీ సీఈవో అయిన శశి దణతుంగే అంటున్నారు.
రావణుడి వద్ద విమానం నిజంగానే ఉందన్న పరిశోధనలకు విమానయాన రంగ నిపుణులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిశోధన కోసం శ్రీలంక ప్రభుత్వం 5 మిలియన్ శ్రీలంకన్ రూపీస్‌ను విడుదల చేసింది. ఎందరో చరిత్రకారులు, పరిశోధకులు, రచయితలు రావణాసురుడికి సంబంధించి అనేక రచనలు చేశారు.