Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

అభినందన్ వర్థమాన్‌కు దీపావళి గిఫ్ట్ ... గ్రూప్ కమాండర్‌గా పదోన్నతి

Advertiesment
Abhinandan Varthaman
, గురువారం, 4 నవంబరు 2021 (12:47 IST)
‘బాలాకోట్’ హీరోగా దేశ ప్రజలతో ప్రశంసలు అందుకున్న అభినందన్ వర్ధమాన్‌కు భారత వైమానికి దళం దీపావళి బహుమతి ఇచ్చింది. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వింగ్ కమాండర్‌గా ఉన్న ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కల్నల్ ర్యాంకుతో సమానం కావడం గమనార్హం. 
 
గతంలో పుల్వామాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత సైన్యం బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో రగిలిపోయిన పాక్ 27 ఫిబ్రవరి 2019న ఎఫ్-16 యుద్ధ విమానంతో భారత్‌పైకి దాడికి యత్నించింది. 
 
పాక్ ప్రయత్నాన్ని భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తిప్పికొట్టారు. ఓ సాధారణ మిగ్-21 విమానంతో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానమైన ఎఫ్-16ను వెంటాడి నేల కూల్చారు.
 
ఈ క్రమంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో తప్పించుకోగలిగారు. అయితే, ఆయన దిగింది పాక్ భూభాగంలో కావడంతో పాక్ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ రక్షణకు సంబంధించిన వివరాలపై ఆయన నోరు విప్పలేదు.
 
అదేసమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరగడంతో అభినందన్‌ను పాకిస్థాన్ విడిచిపెట్టింది. భారత్‌కు తిరిగొచ్చిన అభినందన్ కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరారు. 
 
ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు 2019లో ‘వీర్ చక్ర’ అవార్డును ఇచ్చి గౌరవించింది. తాజాగా వాయుసేన ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా నియమించిస్తూ వాయుసేన ఉత్తర్వులు జారీచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికా నవలా రచయితకు బుకర్ ప్రైజ్