టంటారా అనే చిన్నపట్టణ మేయర్ చచ్చిన శవంలా నటించారు. అచ్చం శవంలా నటించడంతో చివరకు పోలీసులు సైతం ఆయన్ను నిజంగానే చనిపోయినట్టు భావించారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. టంటారా మేయర్. ఆయన శవంలా నటించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. తన మిత్రులతో కలిసి ఆయన మందు పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీసులు వచ్చారు. అంతే.. స్నేహితులంతా పారిపోగా, ఆయన మాత్రం అక్కడే ఉండిపోయి చచ్చిన శవంలా నటించారు.
తాజాగా వెలుగులోకి ఈ ఆసక్తికర సంఘటన వివరాలను పరిశీలిస్తే, దక్షిణ పెరూలో టంటారా అనే ఓ చిన్న పట్టణానికి జేమీ రొనాల్డో ఉర్బినా టోరెస్ అనే వ్యక్తి మేయరుగా ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఈ మేయరుగారూ... తానే లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచారు. తన మిత్రులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నాడు. ఇంతలో పోలీసులు అటుగా వచ్చారు. అంతే.. మిగిలిన మిత్రులంతా పారిపోగా, ఈయన మాత్రం చచ్చిన శవంలా నటించడం విస్తుగొలుపుతోంది.
నిజానికి ఈ మేయర్‌పై ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయంలేదు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఏనాడూ సమీక్ష జరపడంగానీ, అధికారులకు దిశానిర్దేశం చేసిన పాపనపోలేదు. వీటన్నింటికీ పరాకాష్టగా ఇపుడు మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు.
సోమవారం రాత్రి టోరెస్ తన మిత్రులతో కలిసి మద్యం తాగుతున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో ఖంగుతిన్న మేయర్ టోరెస్ పక్కనే ఉన్న ఓ శవపేటికలో దూరి చచ్చినవాడిలా పడుకున్నాడు. పైగా ఓ మాస్కు కూడా ధరించి శవంలా నటించాడు.
కానీ, ఆయన నాటకాన్ని పసిగట్టిన పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ స్థాయిలో విధించిన లాక్ డౌన్ నియమావళిని ఉల్లంఘించాడంటూ అతడిపై ఆరోపణలు మోపారు. పెరూలో జాతీయ స్థాయి లాక్డౌన్ ప్రకటించి 66 రోజులు కాగా, లాక్డౌన్ ప్రారంభమయ్యాక సదరు మేయర్ టంటారా పట్టణంలో ఉన్నది కేవలం 8 రోజులేనట.