పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇండోపాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ కుట్రకు జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఈ దాడిలో భాగంగా, జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడుల చేసేందుకు పాక్ ఉగ్రవాదులు పథకాలను రచిస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు ఎయిర్‌బేస్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, చారిత్రాత్మక ఇస్లామిక్ యుద్ధం 'బదర్'ను పురస్కరించుకుని జరుపుకునే వేడుకకు ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉంది. మహమ్మద్ ప్రవక్త సాధించిన తొలి మిలిటరీ విజయమే బదర్. ఈ నెల 23న ఈ వేడుక జరగనుంది. పుల్వామా ఘటనకు పాల్పడిన జైషే మొహమ్మద్ ఈ దాడులకు స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈనెల 23వ తేదీనే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.