సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇపుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు విసురుతున్నారు.
తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అందుకు బాధ్యతగా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. "లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అందుకు పూర్తి బాధ్యత నాదే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీ గెలుపు, ఓటములకు మంత్రులు, శాసనసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధిష్టానం ఎప్పుడో చెప్పింది. నేనైతే ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది" అని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తుదివిడతలోనే పంజాబ్‌లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది.