Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌తో మూడు సార్లు యుద్ధాలు చేశాక గుణపాఠం నేర్చుకున్నాం.. పాకిస్థాన్ ప్రధాని

shehbaz sharif
, మంగళవారం, 17 జనవరి 2023 (14:41 IST)
శత్రుదేశం భారత్‌తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాతగానీ తమకు గుణపాఠం నేర్చుకోలేక పోయామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకునిపోయింది. దీంతో తమను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని ఆ దేశ పాలకులు ప్రాధేయపడుతున్నారు. ఈ నేపథ్యంలో  షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్‌తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత పాకిస్థాన్‌ గుణపాఠం నేర్చుకుందని అంగీకరించారు. 
 
అంతేకాకుండా పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన.. కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని సూచించారు. దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడిన పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌.. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పిలుపునిచ్చారు. 
 
'భారత నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నా సందేశం ఏమిటంటే.. ఇరు దేశాల మధ్య ఎంతో కాలంగా నడుస్తోన్న కాశ్మీర్‌ వంటి వివాదాలపై నిజాయితీ, నిబద్ధతతో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడం లేదా ఒకరికొకరు తగువులాడుతూ సమయం, వనరులను వ్యర్థం చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది' అని అన్నారు. 
 
అలాగే, 'భారత్‌తో మేం మూడు యుద్ధాలు చేశాం. వాటితో ప్రజలకు చివరకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం మాత్రమే. మేం గుణపాఠం నేర్చుకున్నాం. భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం. దీంతో మా దేశంలో నెలకొన్న అసలు సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కలుగుతుంది' అని పాక్‌ ప్రధాని అన్నారు. 
 
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీ కింద అందించలేకపోతోంది. ఇతర వస్తువుల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా గోధుమ పిండి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. మరోపక్క తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. 
 
ఇలా వివిధ రూపాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు.. విదేశాల నుంచి సహాయం మాత్రం అంతంతగానే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో శాంతిపేరుతో భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య