త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారతీయ రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక వందే భారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సేవలను ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలుత సికింద్రాబాద్ - విజయవాడల మధ్యే నడుపుతారంటూ వార్తలు వచ్చాయి.
అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు నడుస్తుందని తెలిపారు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తుందన్నారు.
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, ఈ నెల 19వ తేదీన ఈ రైలు సేవలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభమయ్యే ఎనిమిదో వందే భారత్ రైలు.