శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కవ్వింపులకు తెరలేపింది. నియంత్రణ రేఖ దాటొచ్చి మరీ దురాగతానికి పాల్పడింది. ఆ వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు.. పాకిస్థాన్ సైనికుల ఆటకట్టించారు. పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేసింది. దాయాది దేశం సైన్యం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఎల్‌వోసీ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు యత్నించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల ఒకటో తేదీన కృష్ణఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు పేర్కొన్నాయి. అందుకు ధీటుగా భారత సైనిక బలగాలు ధీటుగా స్పందించాయి. ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు, భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది.
కాగా, గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు, కాల్పులు ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఉగ్రవాదులతో కలిసి పాకిస్థాన్ సైన్యం అనేకసార్లు చొరబాటుకు యత్నించినప్పటికీ భారత సైన్యం ఆ చొరబాట్లను తిప్పికొట్టింది.