ఓ బిడ్డతల్లి కక్కుర్తికి పాల్పడింది. ఓ స్టోర్‌లోకి తన స్నేహితురాళ్ళతో కలిసి వెళ్లిన ఆమె.. చోరీకి పాల్పడింది. ఈ క్రమంలో ఆ స్టోర్‌లో కన్నబిడ్డను మరిచిపోయి వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్లాక బిడ్డ గుర్తుకు వచ్చి తిరిగి స్టోరుకు వచ్చి, పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా, దానిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ తన పసిబిడ్డతో పాటు.. మరో ఇద్దరు మహిళా స్నేహితురాళ్ళతో కలిసి ఓ స్టోర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో స్నేహితులిద్దరూ స్టోర్ యజమానితో మాటలు కలుపగా బిడ్డను పక్కన కూర్చోబెట్టిన సదరు మహిళ స్ట్రోలర్‌ను తీసుకుని ఎంచక్కా బయటికి వచ్చేసింది.
ఆ తర్వాత ఆమె స్నేహితులు కూడా స్టోరు నుంచి బయటకు వచ్చేశారు. వారంతా కొంతదూరం వెళ్లాకగానీ, బిడ్డ విషయం గుర్తుకురాలేదు. దీంతో పరుగుపరుగునా మళ్లీ ముగ్గురూ కలిసి స్టోర్‌లోకి వచ్చారు. పాపాయిని తీసుకువెళ్తుండగా వారిని పట్టుకున్న స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లపై చోరీకేసు నమోదైంది.
అయితే, ఈ దొంగతనం కేసుపై స్టోరు యజమాని వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.'స్ట్రోలర్ కొట్టేయాలనే తొందరలో కొంతమంది ఎవరి కోసమైతే దానిని దొంగతనం చేస్తారో చివరకు వాళ్లనే ఇలా వదిలివెళ్తారు. దొంగతనం చేయడం వారి వ్యక్తిగత విషయం. అయితే స్టోర్‌లోకి తీసుకువచ్చిన పిల్లలను అలా వదిలేసి వెళ్లకండి. ఇలాంటి వాళ్లకు బుద్ధి రావాలనే ఈ వీడియో షేర్ చేస్తున్నా' అని పేర్కొన్నారు.
దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 'నీ కక్కుర్తి తగలెయ్యా. దొంగతనం చేస్తే చేశావు. బిడ్డను ఎలా మర్చిపోయావు. నువ్వేం తల్లివి? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించుకో' అంటూ నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.