ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుండగా 63 టన్నుల ఆహారం చెత్తకుప్పలపాలవుతున్నట్టు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆహారంలో సింహ భాగం గృహాల నుంచే వస్తోందని ఈ నివేదిక బహిర్గతం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో దాదాపు 60 శాతం గృహాల నుంచే జరుగుతోందని ప్రతి వ్యక్తి యేడాదికి సగటున 79 కిలోల ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 29న అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వృథా అవగాహన దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ఈ వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
యూఎన్‌పీ 2024 ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 కోట్ల టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. ఇందులో గృహాల నుంచి ఏకంగా 63.1 కోట్ల టన్నుల ఆహారం చెత్తకుప్పలకు చేరుతోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ఫుడ్ సర్వీస్ రంగం నుంచి 29 కోట్ల టన్నులు, రిటైల్ దుకాణాల నుంచి 13.1 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు నివేదిక అంచనా వేసింది.
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మందికి పైగా ప్రజలు ఆహార అభద్రతతో సతమతమవుతుండగా, మరోవైపు ఇంత భారీ స్థాయిలో ఆహారం వృథా కావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఆహార వృథాను అరికట్టడం మానవాళి ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నిలుస్తోంది.