ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని గ్వాంగ్జౌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దాదాపు 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ సిటీలో గత వారం రోజుల్లో 20 మందిలో ఈ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా బయటపడిన కేసుల్లో వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో రాసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గాంజావ్ ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.
తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో మళ్లీ పదుల సంఖ్యలో కరోనా కేసులు విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్ అన్వేషణలో భాగంగా లివాన్ జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది.
నిజానికి వ్యాక్సినేషన్ తప్ప ఎవరెంత చేసినా కరోనా కట్టడి కష్టసాధ్యమని తేలిపోయింది. లాక్డౌన్లు, మాస్కులు, భౌతికదూరాలు తాత్కాలికమే తప్ప, దీర్ఘకాలంలో పనిచేయవని వెల్లడైంది. చైనాలో కరోనా వ్యాప్తి తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కఠినమైన రీతిలో లాక్డౌన్ విధించారు. అయితే లాక్డౌన్ సడలించగానే మళ్లీ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా, గ్వాంగ్జౌ నగరంలో 20 కొత్త కేసులను గుర్తించారు. 20 పాజిటివ్ కేసులంటే పెద్ద విషయమేమీ కాకపోయినా, తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది కొత్త వేరియంట్ అని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
మునుపటి వేరియంట్లతో పోల్చితే దీని వల్ల అధిక ముప్పు ఉంటుందని చైనా అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, కొత్త వేరియంట్ ఉనికిని గుర్తించేందుకు పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైందని భావిస్తున్న లివాన్ జిల్లాలో మార్కెట్లు, రెస్టారెంట్లు మూసివేశారు. బహిరంగ కార్యక్రమాలపైనా, సాంస్కృతిక కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించారు.