తమ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున బహిరంగ సవాల్ విసిరారు. సర్వే చేసిన అధికారులు కూడా తాము నివేదిక సరైన రీతిలో సమర్పించలేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, వావి వరసలు మరిచి అధికారులు నివేదికలు ఇవ్వడం ఏంటీ? అని ఆమె ప్రశ్నించారు. ఈటల భూములపై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికలు ఇచ్చారు.
తమ హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వాటిని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసని చెప్పారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో తాము 46 ఎకరాల భూమి కొనుగోలు చేశామన్నారు. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తానని అన్నారు.
సర్వే చేసిన అధికారులు కూడా తాము నివేదిక సరైన రీతిలో సమర్పించలేదని తేలితే ముక్కు నేలకు రాస్తారా? అని ఆమె ప్రశ్నించారు. తమ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆమె చెప్పారు.
తాము 1992లో దేవరయాంజల్ వచ్చామని, అనంతరం 1994లో అక్కడి భూములు కొన్నామని వివరించారు. తమ గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.