నడిరోడ్డు పైనే మెక్సికో దేశాధ్యక్షురాలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటనతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. అసలేం జరిగిందంటే... మంగళవారం నాడు మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై చేయి వేసి ముద్దు పెట్టుకోబోయాడు.
వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకి నెట్టారు. ఐనప్పటికీ అతడు వెనక్కి తగ్గకపోగా ఆమెను చేతులతో తాకరాని చోట అసభ్యంగా తాకే ప్రయత్నం చేసాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ దేశాధ్యక్షురాలికే బహిరంగ లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఐనా ఆ వ్యక్తి దేశాధ్యక్షురాలి సమీపం వరకూ వచ్చేదాకా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు, ఇది ఘోరమైన వైఫల్యం అంటూ మండిపడుతున్నారు. కాగా సదరు వ్యక్తి పూటుగా మద్యం సేవించి వున్నట్లు సమాచారం.