చైనాలోని చాంగ్‌షా నగరంలోని ఓ ఆకాశహార్మ్యంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 200 మీటర్లు ఎత్తయిన భారీ భవంతిలో దట్టమైన పొగతో కూడిన మంటలు వ్యాపించడంతో డజన్ల కొద్దీ కార్యాలయాలు తగబలపడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, డజన్ల కొద్దీ ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయితే, ఈ ఘటనలో ఏదైనా ప్రాణనష్టం సంభవించిదా లేదా అన్నది తెలియాల్సివుంది.
సుమారుగా కోటి మంది వరకు జనాభా కలిగిన ఈ చాంగ్‌షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ భవంతిలో అగ్నిప్రమాద కారణంగా ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
పదుల సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు, సిబ్బంది సమీప భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.