ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోమారు వార్తల్లో నిలిచారు. తనలోని ఉదారతను చాటుకోవడం ద్వారా ఆమె వార్తలకెక్కారు. తనకు విడాకుల తర్వాత లభించిన సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికే కేటాయిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు ఆమె ఏకంగా 19.25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.70 లక్షల కోట్లు) విరాళంగా అందించి రికార్డు సృష్టించారు.
ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మెకంజీ స్కాట్ తన 'యీల్డ్ గివింగ్' అనే దాతృత్వ సంస్థ ద్వారా ఈ భారీ విరాళాలను అందిస్తున్నారు. విద్య, విపత్తు నిర్వహణ, ఇతర సామాజిక అంశాలపై పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలకు ఆమె ఆర్థిక చేయూతనిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇచ్చే నిధులు 'అన్ రిస్ట్రిక్టెడ్ గ్రాంట్స్' కావడంతో ఆయా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఆ డబ్బును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
కాగా, 2019లో జెఫ్ బెజోస్‌తో డాకులు తీసుకున్న సమయంలో అమెజాన్ కంపెనీలో ఆమెకు 4 శాతం వాటా లభించింది. దీని విలువ దాదాపు 139 మిలియన్ షేర్లు. అప్పటి నుంచి తన వాటాను క్రమంగా విక్రయిస్తూ వస్తున్న మెకంజీ, ఆ వచ్చిన డబ్బును పూర్తిగా దానధర్మాలకే కేటాయిస్తున్నారు.
ఇప్పటివరకు తన వాటాలో 42 శాతం అంటే దాదాపు 58 మిలియన్ షేర్లను ఆమె విక్రయించారు. ఇంత భారీ మొత్తంలో నిరంతరం విరాళాలు అందిస్తున్నప్పటికీ, మెకంజీ స్కాట్ నికర ఆస్తుల విలువ ఇంకా 35.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.15 లక్షల కోట్లు)గా ఉంది. సంపదను సమాజ హితం కోసం వెచ్చించడంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.